తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చంద్ర‌బాబు, కేసీఆర్ మ‌ధ్య‌నేనా?

చంద్ర‌బాబు రంగ ప్ర‌వేశంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. ఇటీవ‌లి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ మీద‌నే విమ‌ర్శ‌లు చేసిన టీఆర్ఎస్ ముఖ్య నాయ‌కులు ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు కేంద్రంగా ప్ర‌చారంలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవ‌డం తెరాస‌కు, కేసీఆర్‌కు పెద్ద‌గా స‌మ‌స్య కాదు. కానీ కూట‌మి పేరుతో చంద్ర‌బాబు కీలకంగా వ్య‌వ‌హ‌రించి చివ‌రికి టీ ఆర్ ఎస్‌ను ఎంతో కొంత డిఫెన్స్‌లో చంద్ర‌బాబు ప‌డేశారు. దీనివ‌ల్ల‌నే టీ ఆర్ ఎస్‌కు చంద్ర‌బాబు కాంగ్రెస్ కంటే పెద్ద శ‌త్రువుగా మారాడు.

KCR and Chandrababu Naidu War
KCR is furious on Chandrababu Naidu after latter’s initiations on the formation of Praja Kutami in Telangana.

కాంగ్రెస్‌, టీడీపీ చేతులు క‌లిపిన ద‌గ్గ‌ర్నుంచి తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కుల్లో కొంత ఆందోళ‌న ఏర్ప‌డిన మాట వాస్త‌వం. ఈ పొత్తుకు మొద‌టి ప్ర‌యోగ‌శాల‌గా తెలంగాణను ఎంచుకున్నారు. కాబ‌ట్టి ఇక్క‌డ విజ‌యం కాంగ్రెస్ – టీడీపీ పొత్తు నిల‌వ‌డానికి చాలా కీల‌కం. జాతీయ రాజ‌కీయాల‌ను కూడా ఈ విజ‌యం గ‌ణ‌నీయంగా ప్ర‌భావితం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

అందుకే కూట‌మిని ఎలాగైనా ఓడించాల‌ని కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌, ఇత‌ర టీ ఆర్ ఎస్ నాయ‌కులు అన్ని అస్త్రాల‌ను మోహరించినట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జర‌గ‌నున్న ఆంధ్రా రాజకీయాలను కూడా ప్రభావితం చేయ‌నున్నాయి.

మ‌రోవైపు కాంగ్రెస్ నాయ‌కులు కూడా చంద్ర‌బాబును ప్ర‌ధానంగా ముందు నిల‌బెడుతున్నారు. హైద‌రాబాద్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, రంగారెడ్డి జిల్లాల్లో క‌నీసం 25 – 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించ‌డ‌మే కాదు.. సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితులు ఉన్నాయి. పోటీ చేస్తున్న 13 సీట్ల‌లో కూడా టీడీపీ సొంత బ‌లం ఎక్కుగా ఉన్న‌వే ఉన్నాయి. అందువ‌ల్ల టీడీపీ గెలుపు కాంగ్రెస్‌కు కూడా కీల‌కం కానుంది. అందుకే చంద్ర‌బాబును హైద‌రాబాద్‌, ఖ‌మ్మంల‌లో ప్ర‌చారానికి ఒప్పించారు.

చంద్ర‌బాబు చొర‌వ తీసుకోక‌పోయి ఉంటే తెలంగాణ‌లో త్రిముఖ పోటీ లేదా చతుర్ముఖ పోటీ ఉండేది. కాంగ్రెస్‌, టీజేఎస్‌, టీడీపీ, బీజీపే, బీఎల్ ఎఫ్‌, టీఆర్ ఎస్ ఎవ‌రికివారే పోటీ చేస్తే ఫ‌లితం త‌ప్ప‌కుండా టీఆర్ ఎస్‌కు అనుకూలంగానే ఉంటుంది. కూట‌మి వ‌ల్ల ఇప్పుడు చాలా నియోజ‌క‌వర్గాల్లో ద్విముఖ పోటీనే ఉంది. ఇది టీఆర్ ఎస్‌కు రుచించ‌ని విష‌య‌మే.