కేసీఆర్‌ను పైకెత్తితే జ‌గ‌న్ గెలుస్తాడా…?

కొంత‌మంది నాయ‌కుల ప్ర‌సంగాలు, వ్య‌వ‌హార‌శైలి పార్టీల‌కు అతీతంగా చాలామందికి న‌చ్చుతాయి. అలాంటివారిలో కేసీఆర్ ఒక‌రు. ఆయ‌న ప్ర‌సంగాల‌కు, వివిధ విష‌యాల‌పై అవ‌గాహ‌న‌, వాద‌నా ప‌టిమ‌కు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే ఇదంతా రాజ‌కీయంగా ఆ అభిమానులు త‌న‌కు ఇస్తున్న మ‌ద్ద‌తు అనుకుంటే పొర‌పాటే. ఇలాంటి పొర‌పాటు చేసే చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్‌ తెలంగాణ‌లో బొక్క‌బోర్లాప‌డ్డారు.

సైబ‌రాబాద్ క‌ట్టినా, హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ ప‌టంలో పైకిలేపినా చంద్ర‌బాబు అంటే తెలంగాణ‌లో ప‌రాయి వ్య‌క్తే. లోతుల్లోకి వెళ్లి ఈ విష‌యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేక చంద్రబాబును ముందు నిల‌బెట్టి తెలంగాణ‌లో మ‌ట్టిక‌రిచింది. ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కూడా తెలంగాణ‌లో కాంగ్రెస్ న‌డిచిన బాట‌లోనే న‌డుస్తుంది. ఇటీవ‌ల కేసీఆర్ వైజాగ్ వ‌చ్చిన‌ప్పుడు ఫ్లెక్సీల‌తో వైసీపీ నాయ‌కులు చూపిన అత్యుత్సాహం ఆ పార్టీకి కీడు చేసేదే.

తెలంగాణ‌లో చంద్ర‌బాబును కేసీఆర్ ఓడించాడు కాబ‌ట్టి ఆయ‌న మ‌న మిత్రుడు అవుతాడు, ఏపీలో కూడా కేసీఆర్‌ను వాడుకుందాం అనే ధోర‌ణిలో వైఎస్ఆర్ సీపీ ఉన్న‌ట్టుంది. ఏపీ ప్ర‌జ‌ల్లో కేసీఆర్ అంటే ఎలాంటి అభిమానం ఉందో స‌రిగా అంచ‌నా వేయ‌క‌పోతే తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే జ‌గ‌న్‌కు ప‌డుతుంది.

తెలంగాణ‌లో చంద్ర‌బాబు అంటే ఎంత ఏవ‌గింపు ఉందో ఏపీలో కేసీఆర్ అంటే అంత‌కంటే ఎక్కువే ఏవ‌గింపు ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భావోద్వేగాలు రెచ్చ‌గొట్ట‌డం ద‌గ్గ‌ర్నుంచి, ప‌దునైన భాష‌లో ఆంధ్ర ప్రాంతం వారిని తిట్ట‌డం, హైద‌రాబాద్‌లో సీమాంధ్రుల ప‌ట్ల నిల‌క‌డ‌లేని వైఖ‌రి, మ‌రీ ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేసీఆర్ వ్య‌తిరేక‌త‌… ఇవ‌న్నీ ఆంధ్ర ప్రాంతం ప్ర‌జ‌లు తేలిగ్గా మ‌ర్చిపోయే అంశాలు కాదు. వీటిని ప‌ట్టించుకోకుండా కేసీఆర్‌ను ఏపీలో పైకెత్తితే జ‌గ‌న్ కింద‌ప‌డ‌క త‌ప్ప‌దు.