అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం ఇచ్చిన కిక్కుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అనూహ్య రీతిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించి అనేక సంకేతాలు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పంపించారు. దీంతో ఏదో ఒక రోజు కేటీఆర్ ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తులవడం ఖాయమని అందరికీ అర్థమైంది. అయితే ఇది ఎప్పుడా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది అంత తేలిగ్గా అంతుబట్టే విషయం కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా 16 స్థానాలు (ఒకటి మజ్లిస్‌కు పోగా) గెలవాలనీ, తద్వారా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చక్రం తిప్పాలని కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ముందు ఇక్కడ 16 స్థానాలు గెలవడంపై కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. దీనికి తనే సొంతంగా బరిలోకి దిగాలనే ఆలోచన కూడా కేసీఆర్‌కు ఉన్నట్టు సమాచారం.
కరీంనగర్ నుంచే కేసీఆర్
మొదటి నుంచీ తనకు అచ్చొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక్కడ కేసీఆర్ గెలవడం నల్లేరు మీద బండి నడకే. కేసీఆర్ పోటీలో ఉంటే మిగతా లోక్‌సభ స్థానాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. విజయావకాశాలు మెరుగవుతాయనే ఉద్దేశంతో కేసీఆర్ రంగంలోకి దిగొచ్చు. కేసీఆర్ ఊహించినట్టుగానే మరిన్ని లోక్‌సభ స్థానాలు గెలిస్తే వెంటనే కేటీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు ఇచ్చే అవకాశాలు మెండు. తద్వారా కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించవచ్చు.
ఒకవేళ కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటయితే అందులో కేసీఆర్ కీలకం కావచ్చు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్ వాస్తవరూపం దాల్చకపోతే కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం ఉండదు. ఆ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి వర్గంలో కేసీఆర్ కీలక శాఖలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో చేరామని చెప్పుకోవడం తేలికే. సో, 2019లోనే కేటీఆర్ కు పట్టాభిషేకం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.