ఎన్టీఆర్ – కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో నారా చంద్రబాబు నాయుడు పాత్రను దగ్గుబాటి రాణా పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉంది. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిల వివాహం, అనంతరం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం పెరగడం ఒకదానికొకటి విడదీయరాని అంశాలే. ఈ నేపథ్యంలో భువనేశ్వరి పాత్రను ఎవరు పోషిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన సమాచారం ప్రకారం మళయాళీ నటి మంజిమా మోహన్ నారా భువనేశ్వరి పాత్రను పోషిస్తున్నట్టు వెల్లడైంది.
మంజిమా మోహన్ టీవీ హోస్ట్ నుంచి కెరీర్ ప్రారంభించి నటిగా ఎదిగింది. మళయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. 2017లో ఫిల్మ్ ఫేర్ సౌత్ బెస్ట్ డెబ్యూ (ఫిమేల్) అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు… ఈ కేరళ అమ్మాయి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ కుమార్తె. కేరళలో పుట్టినప్పటికీ తమళనాడులో సెటిలైంది మంజిమా మోహన్. చెన్నైలోని సెల్లా మేరిస్ కాలేజీలో బీఎస్సీ చదివింది. సూర్య టీవీలో హాయ్ కిడ్స్ అనే పిల్లల ప్రోగ్రాం ద్వారా అందరికీ సుపరిచితమైంది. నారా భువనేశ్వరి పాత్ర ద్వారా తెలుగులో కూడా మంజిమా మోహన్ ప్రేక్షకాదరణ పొందాలని ఆశిద్దాం.