అంత‌రిక్షం.. తెలుగు ఇండ‌స్ట్రీలో సాహ‌స‌మే

దేవ‌ర‌కొండ విజ‌య్ న‌టించిన అర్జున్ రెడ్డి సినిమా విజ‌యం త‌ర్వాత తెలుగు సినిమా గ‌మ‌నంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా కొత్త హీరోలు, ద‌ర్శ‌కుల‌కు అర్జున్ రెడ్డి ఫార్ములా ద‌గ్గ‌రి దారిలా క‌నిపించింది. నాలుగు ముద్దులు, స్కిన్ షో, పోవే, రావే లాంటి సంస్కార హీన, అర్థం ప‌ర్థం లేని డైలాగులు, దిక్కుమాలిన సినిమా టైటిల్స్ (24 కిసెస్ లాంటివి)… వెర‌సి ఒక ద‌రిద్ర‌పు ద‌శ‌కు చేరుకుంది తెలుగు సినిమా. ఈ మొత్తం గ‌మ‌నానికి దూరంగా, ప్ర‌త్యేకంగా, ప్ర‌తిభావంతంగా, ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండే విధంగా కూడా సినిమాలు తీసి విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు అంత‌రిక్షం డైరెక్ట‌ర్ సంక‌ల్ప్‌రెడ్డి.

antariksham

అంత‌రిక్షం సినిమా పేరు, పోస్ట‌ర్లు చూస్తే క‌థ కొంత‌వ‌ర‌కు తెలిసిపోతుంది. ఆమాట‌కొస్తే ఇప్ప‌డు వ‌స్తున్న ఏ సినిమా క‌థ అయినా ఇలాగే చెప్పేయ‌వ‌చ్చు. అయితే క‌థ‌నంలోనే ద‌ర్శ‌కులు అష్ట‌వంక‌రులు తిరిగి మ‌ళ్లీ మొద‌టికొస్తారు… అవే డైలాగులు, పాట‌లు, విభిన్న భంగిమ‌ల్లో ముద్దులు, ప‌ట్టు లేని స్నేహాలు… ఇవేమీ లేకుండా ఎక్క‌డా హీరోయిజం, క‌థ‌లో, క‌థ‌నంలో దాని తాలూకూ వంక‌ర‌లు లేకుండా వంద‌శాతం క‌థ‌కు ప్రాధాన్యం ఇచ్చి అంత‌రిక్షం సినిమా తీయ‌డం విశేషం.

అంత‌రిక్షం అంటే అదేదో పూర్తిగా టెక్నిక‌ల్‌, గ్రాఫిక్స్‌తో కూడిన సినిమా అనుకుంటే పొర‌పాటే. స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అవ‌స‌ర‌మైన భావోద్వేగాల‌కు సినిమాలో కొద‌వ‌లేదు. క‌థ మూలం హాలీవుడ్ సినిమా గ్రావిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నా క‌థ‌నంలో కొంత వైవిథ్యం ఉంటుంది. ఇక స్థూలంగా క‌థ‌లోకి వెళ్తే… ఇస్రో ప్ర‌యోగించిన మిహిర శాటిలైట్ గ‌తిత‌ప్పి వేరే శాటిలైట్‌తో ఢీకొట్టే ప్ర‌మాదంలోకి వెళుతుంది. దీనివ‌ల్ల ప్రపంచ‌వ్యాప్తంగా క‌మ్యూనికేష‌న్ వ్య‌వస్థ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. దీన్నినివారించ‌డానికి హీరోను వెతికి ప‌ట్టుకోవ‌డం హీరోయిన్ ప‌ని. ఈ ప్ర‌క్రియ‌లో మొద‌టి భాగం సినిమా సాధార‌ణ తెలుగు సినిమా మాదిరిగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఊపందుకుంటుంది.

తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ప్ర‌యోగం చేయ‌డం ద‌ర్శ‌కుడి సాహ‌స‌మే. హాలీవుడ్ భారీ బ‌డ్జెట్ హై ఎండ్ గ్రాఫిక్స్ సినిమాల‌తో పోల్చుకోకుండా వెళితే సంతృప్తిక‌రంగానే థియేట‌ర్ నుంచి బ‌య‌టికి రావ‌చ్చు. ముఖ్యంగా స్కూలు పిల్ల‌ల‌ను సినిమా సెకండాఫ్ బాగా ఆక‌ట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం సినిమాకు ప్ల‌స్ పాయింట్‌.