తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరోపార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసే దిశగా ఆపార్టీ అధినేత అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్ వైఖరి చూస్తుంటే ఇది జరగడానికి ఎన్నో రోజులు ఆగాల్సిన పని లేదనిపిస్తుంది. మొదటి నుంచీ 100 సీట్లు లక్ష్యంగా చెబుతున్న టీఆర్ఎస్ ఎన్నికల్లో 100 రాకపోయినా, ఇతర పార్టీల వాళ్లను కూడా కలుపుకొని 100 టార్గెట్ చేరుకునే దిశగా పయనిస్తోంది.
ముఖ్యంగా ఎప్పటికైనా తనకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి వీలైనంతవరకు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయడం కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తుంది. తాజాగా శాసనమండలిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తమ విభాగాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడం, తర్వాత కొద్ది గంటల్లోనే మండలి చైర్మన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం చూస్తుంటే పరిణామాలు ఎంత వేగంగా మారబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. కింది స్థాయి కార్యకర్తల నుంచి ఒత్తిడి పేరుతో రేపోమాపో సండ్ర వెంకట వీరయ్య, ఆపై మచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారు. దీంతో టీడీపీకి ఏ సభలోనూ ప్రాతినిధ్యం ఉండదు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ దాదాపు ఖాయమైనట్టే. త్వరలో జరగనున్న పంచాయతీ, లోక్సభ ఎన్నికల నాటికి ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్ వెంట ఉంటారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యే అవడానికి కోట్లు ఖర్చుపెట్టి అధికారం లేకుండా మళ్లీ అయిదేళ్లు నెట్టుకురావడం వారికి కష్టమే కదా మరి.