నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ట్రైలర్ విడుదల అయింది. హైదరాబాద్‌లో అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన ఆడియో, ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ కుటుంబం అంతా తరలి రావడం విశేషం. ఎన్టీఆర్ కూతుళ్లు, కుమారులు, మనవళ్లు, మనవరాళ్లతో ఫంక్షన్ నిండుగా జరిగింది.
ట్రయిలర్‌కు విశేష స్పందన లభించింది. ఎన్టీఆర్ గెటప్‌లలో బాలయ్య అదరగొట్టాడనే చెప్పాలి. ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టే దశలో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. అది ఇలా కొనసాగుతుంది….. “అరవై ఏళ్లు వస్తున్నాయ్.. ఇన్నాళ్లు మా కోసం బతికాం.. ఇక ప్రజలకోసమే.. ప్రజా సేవలో బతకాలనుకుంటున్నా”
ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా ఆడియోను రిలీజ్ చేయడం విశేషం. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, సూపర్‌స్టార్ కృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు, మంచు మోహన్ బాబు, రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, టి. సుబ్బరామిరెడ్డి, ఆదిశేషగిరిరావు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబం, తారకరత్న, కొరటాల శివ, ప్రణీత, విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్, జయసుధ, జమున, నరేశ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.