తెలుగువారి సిలికాన్ సిటీగా తిరుప‌తి

ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌కు శంకుస్థాప‌న‌లు ఊపందుకుంటున్నాయి. గ‌డ‌చిన‌వారంలోనే అమ‌రావ‌తిలో 5 ఐటీ కంపెనీలు, తాజాగా తిరుప‌తిలో ఎలక్ట్రానిక్ ప‌రిక‌రాల త‌యారీ కంపెనీ టీసీఎల్ కేంద్రాల‌కు ప్రారంభోత్స‌వాలు జ‌రిగాయి. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌చ్చు… గెల‌వొచ్చు కానీ విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చొర‌వ అభినంద‌నీయ‌మే. అనంత‌పురంలో కియా కార్ల కంపెనీ, శ్రీ సిటీ, అమ‌రావ‌తిలో హెచ్‌సీఎల్ లాంటివి స‌మీప భ‌విష్య‌త్తులో ఏపీకి గుర్తింపు తీసుకురానున్నాయి.

తాజాగా తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ ప‌రిశ్ర‌మ‌లు అన్నింటినీ కలిపి సిలికాన్‌ నగరంగా (సిలికాన్‌ సిటీ) త‌మ ప్ర‌భుత్వం గుర్తిస్తుంద‌ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరు – తిరుపతి – చెన్నై కారిడార్‌ను సిలికాన్‌ కారిడార్‌గా పిల‌వ‌నున్న‌ట్టు తెలిపారు. టీసీఎల్ ప‌రిశ్ర‌మ‌కు తిరుప‌తి స‌మీపంలో తాజాగా 158 ఎక‌రాల భూమి కేటాయించారు. టీవీ ప్యాన‌ళ్ల త‌యారీలో టీసీఎల్‌కు మంచి పేరుంది. ఈ రంగంలో టీసీఎల్ ప్రపంచంలో మూడో స్థానంలో, అమెరికా మార్కెట్‌లో రెండో స్థానంలో ఉంది.

రిల‌య‌న్స్ కూడా ఇక్క‌డ కేంద్రం ఏర్పాటు చేయ‌నుంది. దాదాపు 50కిపైనే హార్డ్‌వేర్, ఎల‌క్ట్రానిక్స్ సంబంధిత ప‌రిశ్ర‌మ‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. తిరుప‌తిలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉండ‌టం, చెన్నై జాతీయ ర‌హ‌దారి, ద‌గ్గ‌ర్లోనే పోర్టు సౌక‌ర్యం కూడా ఉండ‌టంతో ప‌రిశ్ర‌మల స్థాప‌న‌కు ఈ కారిడార్ మ‌రింత ప్రాచుర్యం పొంద‌నుంది.