అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఏప్రిల్, మే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అంతేవేగంతో సమాయత్తం అవుతోంది. పలు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ ఇప్పటికే సీట్లు ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సిట్టింగ్‌లు అందరికీ మళ్లీ సీట్లు ఇస్తానని, ఫికర్ చేయకుండా వెళ్లి పనిచేసుకోమని కేసీఆర్ హామీ ఇవ్వడంతో సిట్టింగ్ అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వల్ల ఖాళీ అయిన మల్కాజిగిరి, పెద్దపల్లి స్థానాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
1) ఇప్పటివరకు ఖరారైన అభ్యర్థులు… కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ – కల్వకుంట్ల కవి, మహబూబ్‌నగర్ – జితేందర్‌రెడ్డి, ఆదిలాబాద్ – నగేష్, భువనగిరి – బూర నర్సయ్య గౌడ్, మహబూబాబాద్ – అజ్మీరా సీతారామ్ నాయక్, జహీరాబాద్ – బి.బి. పాటిల్.
2) చెన్నూరు నియోజకవర్గం నుండి బాల్క సుమన్ అసెంబ్లీకి హాజరు కావడంతో పెద్దపల్లి సీటు ఖాళీ అయింది. వీ6 చానల్, విశాఖ ఇండస్ర్టీస్ అధినేత గడ్డం వివేక్ పెద్దపల్లి సీటును దక్కించుకోవడానికి మార్గం సుగుమం అయింది. మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి ఎంపికవడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. బండి రమేష్ మల్కాజ్‌గిరి నుంచి పోటీలోకి దిగే అవకాశం ఉంది.
3) మెదక్ స్థానం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేయవచ్చు, పసునూరి దయాకర్ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీత స్నేహపూర్వక పోటీ ఉంటుంది. టీఆర్ ఎస్ అభ్యర్థిని నిలబెట్టకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
4) గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం ఉంది. ఇది జరిగితే నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పల్లా రాజేశ్వర రెడ్డిను ఎంపిక చేయవచ్చు.
5) నాగర్‌కర్నూల్, చేవెళ్ల స్థానాలపై ఇంకా సందిగ్థత ఉన్నట్టుంది. నాగర్ కర్నూల్‌లో మంద జగన్నాధమ్, రాములు మధ్య పోటీ ఉంది. జగన్నాధం వైపే కేసీఆర్ మొగ్గవచ్చు. చేవెళ్లలో కూడా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మధ్య పోటీ ఉంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లేదా జైపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇక్కడ గట్టి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది.