ఎన్టీఆర్ అంచ‌నాలు మ‌రింత పెంచిన రావ‌ణ పోస్ట‌ర్‌

ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా వాటిలో అభిమానులంద‌రికీ ఎప్ప‌టికీ ప్ర‌త్యేక గుర్తింపు ఉండే పాత్ర… రావ‌ణుడు. సీతారామ క‌ళ్యాణం సినిమాలో ఎన్టీఆర్ రావ‌ణుడి పాత్ర పోషించి త‌న అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు… రావ‌ణుడిపై సాధార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉండే అభిప్రాయాన్ని కూడా మార్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌కృష్ణ రావ‌ణుడి వేషం వేయ‌బోతున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో బాల‌కృష్ణ రావ‌ణుడి వేషంలో ఉండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగాయి. ద‌ర్శ‌కుడు వ్యూహాత్మకంగా సినిమాలో బాల‌య్య వేస్తున్న వివిధ గెట‌ప్‌ల‌ను విడుద‌ల చేస్తూ అభిమానుల్లో అంచ‌నాలు పెంచేస్తున్నారు.

తాజా పోస్ట‌ర్‌లో రావ‌ణుడి వేష‌యంలోని బాల‌కృష్ణ‌తోపాటు, సినిమాలో న‌టిస్తున్న ఇత‌ర అగ్ర నాయ‌కా నాయిక‌లు కూడా ఉండ‌టం విశేషం. సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌కాష్ రాజ్‌, విద్యా బాల‌న్‌, నిత్య మీన‌న్‌, సుమంత్‌, క‌ళ్యాణ్ రామ్‌, న‌రేష్‌, పాయ‌ల్ రాజ్‌పుట్ త‌దిత‌రుల ఫొటోలు కూడా తాజా పోస్ట‌ర్‌లో ఉన్నాయి.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఎంత జాగ్ర‌త్త‌గా తీస్తున్నాడో ఈ పోస్ట‌ర్‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తీ పోస్ట‌ర్ రూప‌క‌ల్ప‌న‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అన్నిటికి అభిమానుల‌ నుంచి మంచి స్పంద‌న వ‌స్తుండ‌టం విశేషం. ఈనెల 21న హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్ క‌థానాయకుడు ఆడియో , ట్ర‌యిల‌ర్ బ‌య‌ట‌కు రానున్నాయి.