తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులకు ట్రక్కు సింబల్ కేటాయించడం వల్ల తాము చాలా సీట్లు కోల్పోయామని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు, కారును పోలి ఉండే ఇతర గుర్తులను కూడా ఎవరికీ కేటాయించవద్దని ఈసీని కోరింది. అంతేగాదు… కారు గుర్తుకు రంగు మరీ పలుచగా వేస్తున్నారని, దీనివల్ల గుర్తు అర్థం కావట్లేదనీ, రంగు కొంచెం పెంచాలని కూడా ఈసీని కోరింది.
ముఖ్యంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలవడంలో ట్రక్కు గుర్తు కీలకంగా మారింది. జగ్గారెడ్డి సాధించిన మెజారిటీ 2589 ఓట్లయితే ట్రక్కు గుర్తుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి పి.రాంచందర్‌కు 4140 ఓట్లు వచ్చాయి. దుబ్బాకలో కూడా పి.మహిపాల్ రెడ్డి అనే స్వతంత్ర అభ్యర్థికి 12000 వేల ఓట్లు వచ్చాయి. ఇతనికి కూడా ట్రక్కు గుర్తు కేటాయించడం వల్లే ప్రజలు కారు, ట్రక్కు మధ్య కన్‌ఫ్యూజ్ అయి ఇన్ని ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది.
వీటితోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కూడా ట్రక్కు గుర్తు ప్రభావం టీఆర్ఎస్‌పై పడింది. ఇండిపెండెంట్లతోపాటు సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు కూడా ఇదే గుర్తు కొన్ని చోట్ల వచ్చింది. దీంతో ఆపార్టీ అభ్యర్థలు కూడా చాలా చోట్ల భారీగా ఓట్లు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన టీఆర్ఎస్ ఈసీని కలిసింది. కారును పోలి ఉండే ట్రక్కు, ఇస్త్రీ పెట్టె, కెమేరా, టోపీ గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని కోరింది.