అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ స్థానం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి వచ్చే మూన్నెళ్లకు ఎంఎల్ఏ కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఎంఎల్ఏగా తిప్పేస్వామి ప్రమాణం చేయనున్నారు. మడకశిర నుంచి గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి ఈరన్న అభ్యర్థిత్వాన్ని హైకోర్టు కొట్టివేయడంతో తిప్పేస్వామికి ఈ అవకాశం లభించింది.
ఈరన్న సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రానుంది. అప్పటి నుంచి మంత్రులు, ఎంఎల్ఏలు అంతా అపద్ధర్మ ప్రతినిధులే. ఎలాంటి అధికారాలు ఉండవు. దీంతో తిప్పేస్వామి ఈ మూడు నెలలే క్రియాశీలక ఎంఎల్ఏగా కొనసాగనున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే తప్ప తిప్పేస్వామికి పూర్తి కాలం ఎంఎల్ఏ చాన్స్ లభించదు.
తెలుగుదేశం అభ్యర్థి ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వివరాలు సమర్పించలేదని హైకోర్టు అతని ఎన్నికను కొట్టివేసింది. నాలుగేళ్ల వాదనల తర్వాత తీర్పు వెలువడింది. వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఎంఎల్ఏ కానున్నారు. ఎమ్మెల్యే అవుతున్నందుకు ఆనందించాలో, మూన్నెళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి.