టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైదరాబాద్‌లో ఆక్రమణలపై కొరడా ఝులిపించడం ఆనవాయితీగా మారింది. 2014లో అధికారం చేపట్టిన తొలినాళ్లలో మాదాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో అనేక కట్టడాలను తొలగించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సర్వే కూడా జరిగింది. అయితే తర్వాత నాగార్జున ఎలాగోలా మేనేజ్ చేయగలిగారు. రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఆక్రమణల కూల్చివేత పర్వం మొదలుపెట్టింది. ఈసారి ప్రముఖ హీరో ప్రభాస్ ఇందులో ఇరుక్కున్నాడు.
రెవిన్యూ అధికారులు హైదరాబాద్ నగరం శివార్లలో అనేక ప్రభుత్వ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. ప్రభాస్‌కు నగరం శివార్లలో గెస్ట్ హౌస్ ఉంది. పైగా భూముల్లో ఇది ఉన్నట్టు రెవిన్యూ అధికారులు గుర్తించి గెస్ట్ హౌస్ గేట్లకు నోటీసులు అంటించారు. వచ్చేవారం ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను కూల్చి వేసే అవకాశం ఉందంటున్నారు.
రాయదుర్గం సమీపంలో అత్యంత విలువైన ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి. ప్రభాస్‌కు సుమారు 3000 గజాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ ఉంది. చాలా ఏళ్ల నుంచి ఈ భూములు వివాదంలో ఉన్నాయి. సుప్రీం కోర్టు ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే అప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఎన్నికలు అయిపోగానే కూల్చివేతలు మొదలుపెట్టడం చర్చకు తావిస్తోంది.
ఇంతకీ బాహుబలి 3 ఎవరంటారా? ఇంకెవరు… కేసీఆర్ సార్. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కేసీఆర్‌ను బాహుబలి 3తో పోల్చాడు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు వచ్చిన మెజారిటీ కేసీఆర్‌కు అంత బలం ఇచ్చిందని చెప్పడానిరి వర్మ తన స్టయిల్‌లో కేసీఆర్‌ను పోల్చి పొగిడాడు.