మ‌ళ్లీ మ‌ళ్లీ అదే మాట ఎందుకు బాబు గారూ..

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు గ‌త కొంత‌కాలంలో ఎక్క‌డికిపోయినా ఒక మాట చెప్పి తెగ బాధ‌ప‌డిపోతున్నారు. నేను టీఆర్ ఎస్‌తో క‌లిసి వెళ్దామ‌నుకున్నాను… వాళ్లే వ‌ద్ద‌న్నారు… ఇదీ ఆ మాట‌. ప‌దే ప‌దే ఇదే మాట‌ను చంద్ర‌బాబు నాయుడు ఎందుకు చెబుతున్నారో రాజకీయ విశ్లేష‌కుల‌కు అంతుబ‌ట్ట‌డం లేదు. దీనివ‌ల్ల టీడీపీకి న‌ష్ట‌మే త‌ప్ప లాభం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

chandrababu press meet

నిజ‌మే అనుకుందాం… అప్పుడెప్పుడో కేటీఆర్‌తో చంద్ర‌బాబు ఫోన్‌లోనో, వేరే విధంగానో అడిగార‌ట‌.. క‌లిసి ప‌నిచేద్దామ‌ని. తెలంగాణ‌లో త‌మ ప్ర‌యోజ‌నాల రీత్యా దానికి కేటీఆర్ తిర‌స్క‌రించారు. వాళ్లు తిర‌స్క‌రించారు కాబట్టే నేను కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టాన‌ని ప్ర‌చారం చేసుకోవడం వ‌ల్ల తెలుగుదేశం న‌ష్ట‌పోయే అవ‌కాశాలే ఎక్కువ‌. మీకంటూ సొంత బ‌లం లేక‌నే పొత్తుల కోసం వెతుకుతున్నార‌నే అభిప్రాయం వెంట‌నే వ‌స్తుంది. కాంగ్రెస్‌తో పొత్తు, మ‌హాకూట‌మి పాచిక తెలంగాణ‌లో పార‌క‌పోయినా ఇంకా అదే మాట‌ను చెప్పుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజనం ఏంటో మ‌రి.

టీఆర్ ఎస్‌తో పొత్తుకే మా మొద‌టి ప్రాధాన్యం అని మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డం వెనుక చంద్ర‌బాబు వ్యూహం ఏంటో చూడాలి మ‌రి. వైసీపీ కూడా దీన్ని వాడుకోవాల‌ని చూస్తుంది. రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన టీఆర్ ఎస్‌తో పొత్తుకు ఎలా ప్ర‌య‌త్నిస్తార‌ని ప్ర‌శ్నిస్తుంది. తిర‌స్క‌రించినా, చీకొట్టినా, త‌న‌కంటే జూనియ‌ర్ నాయ‌కుడు (కేటీఆర్‌) మీతో పొత్తు ఇష్టం లేద‌ని చెప్పినా, చంద్రబాబు అదే మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డం ఆంధ్రుల ఆత్మ గౌర‌వ స‌మ‌స్య‌గా కూడా మారుతుందేమో!