స‌మీపిస్తున్న ఎన్నిక‌లు.. ఏపీలో ఖరారుకాని పొత్తులు

ఏపీతోపాటు మ‌రికొన్ని రాష్ట్రాలు, లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌ర్లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో మార్చి 5 న నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈసారి మ‌రో వారం ముందుగానే నోటిఫికేష‌న్ వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కింది. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌భావం కూడా ఎలా ఉంటుందా అని రాజ‌కీయ పార్టీలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి.

ఏపీలో పొత్తులు కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు ఉంటుందా లేదా అనేది చంద్ర‌బాబు నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ జ‌గ‌న్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి పోటీ చేస్తే టీడీపీ, కాంగ్రెస్ పొత్తు కూడా దాదాపు ఖాయ‌మైన‌ట్టే.

Babu Jagan KCR

కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బట్టి చూస్తే వైసీపీ, జ‌న‌సేన క‌లిసే అవ‌కాశాలు అరుద‌నే చెప్పాలి. ఒక వేళ మోదీ, అమిత్ షా పూనుకొని ఏదైనా మంత్రాంగం జరిపితే త‌ప్ప వైసీపీ, జ‌న‌సేన పొత్తు సాధ్యం కాదు.

ప్ర‌స్తుత రాజ‌కీయం వాతావ‌ర‌ణం చూస్తే బీజేపీ జ‌త‌క‌ట్ట‌డానికి ఏపార్టీ కూడా ముందుకొచ్చే ప‌రిస్థితులు ఏపీలో లేదు. ప‌రోక్షంగా మ‌ద్ద‌తు తీసుకోవ‌డం త‌ప్ప బ‌హిరంగంగా బీజేపీతో క‌లిస్తే న‌ష్టపోవాల్సి ఉంటుంద‌నేది అన్ని పార్టీల‌కు అర్థ‌మైన‌ట్టుంది. అందుకే ప్ర‌ధాని మోదీ జ‌న‌వ‌రిలోనే స‌భ‌లు ఏర్పాటు చేసి ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డం ద్వారా పొత్తులకు మార్గం వేయాల‌ని భావిస్తున్న‌ట్టుంది.

ప్ర‌స్తుతానికి ఖ‌రారైన పొత్తు ఒక‌టే. వైసీపీకి టీఆర్ ఎస్‌, మ‌జ్లిస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో ఒక పొత్తు స్ప‌ష్ట‌మైంది. ఎన్నిక‌ల్లో పొటీ చేయ‌క‌పోయినా మ‌జ్లిస్ నేత అస‌దుద్దీన్ తాను ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. అలాగే టీఆర్ ఎస్ కూడా పోటీ చేసే అవ‌కాశం లేదు.. వైసీపీ తెలంగాణ‌లో త‌మ‌కు స‌హ‌క‌రించిన విధంగానే ఏపీలో వైసీపీకి టీఆర్ ఎస్ స‌హ‌క‌రించ‌నుంది. ఇది వైసీపీకి లాభిస్తుందా, లేక‌పోతే తెలంగాణ‌లో టీడీపీ మాదిరిగా న‌ష్ట‌పోతుందా అనేది వేచి చూడాలి.