ఎన్నికల కోడ్ వల్ల పంపిణీ ఆగిపోయి మూలన పడేసిన బతుకమ్మ చీరలను మళ్లీ దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో మహిళలు టీఆర్ ఎస్‌కు నీరాజనాలు పట్టడంతో కేసీఆర్ తక్షణం బతుకమ్మ చీరలను మహిళలక పంచాలని ఆదేశాలిచ్చారు. దీంతో తెలంగాణలో మళ్లీ బతుకమ్మ పండగ వాతావరణం నెలకొననుంది.
ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. 2017 నుంచి టీఆర్ ఎస్ ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు చీలర పంపిణీ చేస్తుంది. ఈ చీరల నాణ్యత గురించి ప్రతిపక్షాలు అనేక సార్లు విమర్శించాయి. అయితే మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రభుత్వం కొనసాగిస్తుంది.
96 లక్షల చీరలు
ఈ ఏడాది కూడా రూ.300 కోట్లు ఖర్చు చేసి 96 లక్షల చీరలను సిద్ధం చేశారు. సిరిసిల్ల నేత కార్మికులతో ఈ చీరలు నేయించడం ద్వారా నేత కార్మికులకు కూడా మంచి ఉపాధి లభించినట్లయింది. అయితే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారి, ఈసీ అభ్యంతరం చెప్పడంతో చీరలను గోదాముల్లో భద్రపరచారు.
ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం, మహిళలు భారీగా టీఆర్ ఎస్‌కు ఓట్లు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో తక్షణం బతుకమ్మ చీరల పంపినీకి సీఎం ఆదేశం ఇచ్చారు. జిల్లాలో ఆయా జిల్లా స్థాయి అధికారులు, గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా చీరలను పంపిణీ చేస్తారు.