తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఏపీలోని పార్టీలకు మరిన్ని తిప్పలే తెచ్చాయి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఇక ఏపీలో ఆయన్ను ఎదుర్కోవడం కష్టమవుతుందేమోనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారు. ఎలాగైనా చంద్రబాబును తెలంగాణలో ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడం, అనుకున్నట్టుగానే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం రెండు సీట్లకు పరిమితం కావడం, ప్రజా కూటమి ఓడిపోవడం జరిగాయి. ఇది వైసీపీకి ఏపీలో మంచి ఉత్సాహాన్ని ఇచ్చే పరిణామమే. అయితే టీఆర్ ఎస్ గెలిచాక జరుగుతున్న పరిణామాలో వైసీపీకి కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి.
తెలంగాణలో చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ చేయి పెట్టడం ద్వారా కాంగ్రెస్ చేతులు కాల్చుకున్నదనే అభిప్రాయం ఒక వర్గం కాంగ్రెస్ నాయకుల్లో బలంగానే ఉంది. రేపు ఏపీ ఎన్నికల్లో జగన్ చేతుల్లో కేసీఆర్, అసదుద్దీన్ చేతులు పెడితే కాలేది ఎవరి చేతులనేది ఆలోచించాల్సిన విషయమే. తెలంగాణలో జరిగినట్టే జరిగితే కాలేది జగన్ మోహన్ రెడ్డి చేతులే కదా. టీఆర్ ఎస్ విజయోత్సవాలు ఏపీలో కూడా ఘనంగానే జరిగాయి.
ఏపీలో వేలు పెడతామన్న కేసీఆర్, జగన్ నాకు మంచి మిత్రుడన్న అసదుద్దీన్ వ్యాఖ్యలను తెలుగుదేశం తనకు అనుకూలంగా మలచుకోవడానికి మళ్లీ సెంటిమెంట్‌ను బయటకు తీస్తోంది. ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్న కేసీఆర్‌తో వైసీపీ దోస్తీ తమకు లాభిస్తుందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే కేసీఆర్, అసదుద్దీన్ ఏపీకి వస్తే తమకే మంచిదనే అభిప్రాయంలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. టీఆర్ ఎస్, వైసీపీ, మజ్లిస్ దోస్తీని వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెల్లాలని ప్లాన్ చేస్తున్నారు.
టీఆర్ ఎస్‌కు మద్దతు ఇవ్వడం వల్ల ఏపీలో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలపై వైసీపీ కూడా అంతర్మథనం చెందుతోంది. హైదరాబాద్‌లో, మరీ ముఖ్యంగా కూకట్‌పల్లిలో వైసీపీ బహిరంగంగానే టీఆర్ ఎస్‌కు మద్దతు ప్రకటించింది. టీఆర్ ఎస్ నాయకులు వైసీపీకి ఎన్నికల ఫలితాల తర్వాత దన్యవాదాలు కూడా తెలిపారు. ఏపీలోనూ వైసీపీ శ్రేణులు సంబరాలు, కేక్ కటింగ్‌లు, ఫ్లెక్సీల్లో ఫొటోలతో ఆనందపడ్డాయి.
ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని వైసీపీలో కూడా కొందరు గట్టిగానే నమ్ముతున్నారు. ఇది గుర్తించే బొత్స సత్యనారాయణ మీడియా ముందుకొచ్చి టీఆర్ ఎస్‌తో తమకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసేకంటే ఇతర పార్టీల మద్దతు ఉంటే విజయావకాశాలు పెరగవచ్చు కానీ, టీఆర్ ఎస్‌తో దోస్తీ ఏ మేరకు మేలు చేస్తుందనేది వైసీపీ ఆలోచించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలో మున్ముందు జగన్ మోహన్ రెడ్డి వ్యూహం ఏంటనేది వేచి చూడాలి.