ర‌విశాస్త్రి పిల్లాడిలా మాట్లాడుతున్నాడు… గంభీర్‌

మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు ఎలాంటి ఫిల్ట‌ర్‌లు లేకుండా మాట్లాడే క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్‌. ఇటీవ‌లే అన్ని ర‌కాల అంత‌ర్జాతీయ‌ క్రికెట్ మ్యాచ్‌ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన గంభీర్ తాజాగా టీమ్ ఇండియా కోచ్ ర‌విశాస్త్రి మీద విరుచుకుప‌డ్డాడు. గ‌త 15 ఏళ్ల‌లో విదేశాల్లో ప‌ర్య‌టించిన భార‌త జ‌ట్ల‌లో విరాట్ కోహ్లి నాయ‌క‌త్వంలోని ప్ర‌స్తుత జ‌ట్టే అత్యుత్త‌మం అని ఇటీవ‌ల ర‌విశాస్ర్తి అన్నాడు. ఇది అనిల్ కుంబ్లేని అవ‌మానించిన‌ట్లేన‌ని గంభీర్ కుండ‌బద్ద‌లుకొట్టాడు. ర‌విశాస్త్రి మీద ఇంకా తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు. ఏమ‌న్నాడో చూడండి…

gautam gambhir

అతను క్రికెట్ స‌రిగా చూడ‌డేమోన‌ని అనుకుంటున్నాను. చూస్తే అలా మాట్లాడేవాడు కాదు. చిన్న‌పిల్ల‌లు అలా మాట్లాడ‌తారు. తన సొంత కెరీర్ గురించి, ప్రస్తుత కోచ్ సాధించిన విజయాల గురించి నాకు పూర్తిగా తెలియదు. ఏమీ సాధించ‌ని వాళ్లు సాధార‌ణంగా ఇలాంటి మాట‌లు మాట్లాడుతుంటారు…. ఇవీ గంభీర్ వ్యాఖ్య‌లు.

అంతేకాదు… అనిల్ కుంబ్లే కెప్టెన్ గా ఉన్న స‌మ‌యం భార‌త్ టెస్ట్ క్రికెట్‌కు చాలా ముఖ్య‌మైంద‌ని గౌత‌మ్ గంభీర్ చెప్పాడు. కుంబ్లే చాలా నిజాయ‌తీ గ‌ల ఆట‌గాడు, నిస్వార్థ నాయ‌కుడు, కొంత ఎక్కువ కాలం కుంబ్లే కెప్టెన్‌గా ఉంటే భార‌త క్రికెట్ మ‌రింత గొప్పగా ఉండేది. కానీ కుంబ్లేను జ‌ట్టు నుంచి తొల‌గించిన విధానం దారుణం అని గంభీర్ వ్యాఖ్యానించాడు.