శనివారం ఉదయం బంజారా హిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా జనసందడి నెలకొంది. హరీష్ రావు ఇంటివద్దకు భారీ సంఖ్యలో జనం వస్తుండటంతో మీడియా కూడా అలర్ట్ అయింది. కేటీఆర్‌ను టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఏమైనా సంచలనాలు ఉంటాయేమోనని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.
అయితే హరీష్ రావు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినందున అభినందించడానికి ప్రజలు వచ్చారని తెలిసింది. అదే సందర్భంలో కొంత మంది అభిమానులు టీఆర్ ఎస్‌లో తాజా పరిణామాల పట్ల అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. కేటీఆర్ కంటే హరీష్ రావు పార్టీ కోసం ఎక్కువ కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు ఇవ్వలేదని హరీష్‌రావు అభిమానులు కొందరు మాట్లాడుకున్నట్టు తెలిసింది.
కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి, హరీష్‌రావుకు పార్టీ పగ్గాలు ఇస్తే ఇద్దరికీ మంచి గుర్తింపు ఉండేదని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ నిర్ణయం వల్ల అధికారం పూర్తిగా కేటీఆర్ చేతిలోకి వెళ్లిపోయిందని, బ్యాలన్స్ ఆఫ్ పవర్ దెబ్బతిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం హరీష్ రావు కూడా సమయం కోసం వేచి చూడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదని వారి అభిప్రాయం.