అమరావతి యాత్రకు సిద్ధం కండి… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని చూడాలనుకునే ప్రజల కోసం సకల సౌకర్యాలతో అమరావతిని చూపించడానికి ఏర్పాట్లు చేస్తుంది. పోలవరం యాత్ర తరహాలోనే ప్రజలు అమరావతి యాత్రకు కూడా వెళ్లవచ్చు. ఈ యాత్రల ద్వారా ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి ఎంత కట్టుబడి ఉందో ప్రజానీకానికి తెలియజేయవచ్చని, ప్రతిపక్షాల విమర్శలను కూడా తిప్పికొట్టవచ్చని ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీ వ్యూహం.
ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుంది. 30 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించి ఎక్కడ ఏమి కట్టాలో ప్లాన్ చేయడానికి విదేశీ నిపుణులు, కన్సల్టెన్సీల సహాయం తీసుకుంది. అయితే వాస్తవంగా ఆచరణలో ఏం జరిగింది అనేది వెళ్లి చూసినవారికి తప్పితే మిగతా వారికి తెలిసే అవకాశం లేదు.
ప్రతిపక్షాలు మాత్రం రాజధాని నిర్మాణం గ్రాఫిక్స్‌లోనే జరుగుతుందని, ప్రజల నుంచి తీసుకున్న భూములను తెలుగుదేశం నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజాగా ప్రజల నుంచి తీసుకున్న భూముల్లో హ్యాపీ నెస్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రారంభించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
వీటన్నికి సమాధానంగా ప్రజలను అమరావతికి సందర్శనకు అనుమతించి, అన్ని సౌకర్యాలతో వారికి అభివృద్ధి పనుల గురించి వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత రవాణా, భోజన సదుపాయం కల్పించనున్నారు. ముఖ్యంగా రాజధానికి కీలకమైన తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో సందర్శకులను తిప్పనున్నారు. అసెంబ్లీ, సచివాలయం భవనాలు, ఉన్నత స్థాయి అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భవన సముదాయాలు ప్రజలకు చూపించనున్నారు. ఆసక్తి ఉన్నవారు గుంటూరు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.