ఆప‌రేష‌న్ గ‌రుడ.. వైజాగ్ కోడి క‌త్తి.. రాష్ట్రప‌తి పాల‌న‌

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డం, మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డం, అవిశ్వాస తీర్మానం, ఏపీలో ఐటీ దాడులు… ఇలా అన్నీ ర‌స‌వ‌త్త‌ర ఘ‌ట్టాలే. అధికార తెలుగుదేశం మొత్తం వ్య‌వ‌హారాన్ని బీజేపీ – వైసీపీ – జ‌న‌సేన త్ర‌యం కుట్రగా వ‌ర్ణిస్తూ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆప‌రేష‌న్ గ‌రుడ నిత్యం వార్త‌ల్లో ఉంటుంది. ఈ విష‌యంలో చాలామేర‌కు స‌ఫ‌లీకృత‌మైంది కూడా. అయితే ఇక్క‌డ ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. ఎన్ని కుట్ర‌లు చేసినా బీజేపీ ఏపీలో న‌ష్ట‌పోయేది ఏమీ లేదు. ఎందుకంటే అక్క‌డ బీజేపీకి బ‌ల‌మూ, బ‌ల‌గ‌మూ ఏమీ లేవు. అందుకే తెగించి ఏప‌నైనా చేయ‌డానికి సిద్ధం అవుతుంది. వ‌స్తే కొండ‌, పోతే వెంట్రుక అన్న రీతిలో బీజేపీ ఏపీలో పావులు క‌దుపుతుంది.

 

Garuda TDP

 

కానీ వైసీపీ, జ‌న‌సేన ప‌రిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. వాళ్లు బీజేపీతో ప్ర‌త్య‌క్షంగా క‌ల‌వ‌లేని ప‌రిస్థ‌తి ఉంది. కానీ చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాలంటే కేంద్రం, బీజేపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం. అందువ‌ల్ల బీజేపీతో ఏదో విధంగా క‌ల‌వ‌డం ఆ పార్టీల‌కు అనివార్యంగా మారింది. ఈ అవ‌గాహ‌న బ‌య‌ట‌కు పొక్క‌కుండా చేయ‌డానికి జ‌గ‌న్‌, ప‌వ‌న్ ఆప‌సోపాలు ప‌డుతున్నారు. బీజేపీ అంట‌కాగుతున్న విష‌యం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైతే తీవ్రంగా న‌ష్ట‌పోయేది వైసీపీ, జ‌న‌సేన పార్టీలే. చంద్ర‌బాబు మీద ప‌గ తీర్చుకోవ‌డానికి బీజేపీ వైసీపీ, జ‌న‌సేన‌ల‌ను పావులుగా వాడుకుంటుంది.

జ‌గ‌న్ మీద వైజాగ్ ఎయిర్‌పోర్టులో జ‌రిగిన దాడి విష‌యంలో కూడా బీజేపీ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. కేంద్ర మంత్రులు, అధికార ప్ర‌తినిధులు, తెలంగాణ అధికార పార్టీ నేత‌లు ఆగ‌మేఘాల మీద స్ప‌దించ‌డం చూస్తే … అవి సాధార‌ణ స్పంద‌న‌లు, ఖండ‌న‌ల మాదిరి క‌నిపించ‌వు. ఇక గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మ‌రో అడుగు ముందుకేసి ఏపీ డీజీపీకి ఫోన్ చేయ‌డం, నివేదిక ఇవ్వ‌మ‌న‌డం, శాంతి భ‌ద్ర‌త‌ల యాంగిల్‌లో ఆరాలు…. ఆప‌రేష‌న్ గ‌రుడ వాద‌న‌ల‌ను మ‌రింత బ‌లాన్నిచ్చేవే. గ‌రుడ ప్ర‌కారం ఇంకో మూడు నెల‌ల్లో ఏపీలో రాష్ట్రప‌తి పాల‌న రావాలి. అంటే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌కూడ‌ద‌నేది గ‌రుడ వ్యూహం. అంటే వ‌చ్చే మూన్నెళ్ల‌లో మరిన్ని ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయ ఘ‌ట్టాలు చూడ‌టానికి సిద్ధంగా ఉందాం.