తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పరాజయం ఏపీలో రాజకీయాలను కొత్త పుంతలు తొక్కిస్తుంది. తెలంగాణలో కేవలం రెండే సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవడం, సీమాంధ్రులు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో తెలుగుదేశం ఘోరంగా విఫలమవడం తమ విజయాలకు సంకేతంగా వైసీపీ, జనసేన భావిస్తున్నాయి. కేసీఆర్ తమ నెత్తిన పాలుపోసినట్టు భావిస్తున్న వైసీపీ, జనసేన శ్రేణులు ఏపీలో కేటీఆర్, కేసీఆర్‌లకు పాలాభిషేకం చేస్తున్నాయి.
ఇప్పటికే ఏపీలోని అనేక ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ జనసేన కంటే ఈ విషయంలో ముందుంది. స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణులకు తెలంగాణలో తెలుగుదేశం ఓటమి కొత్త రక్తాన్ని నింపిందని వైసీపీ నాయకత్వం భావిస్తుంది. అందుకే బహిరంగంగానే కేసీఆర్‌ను ఏపీకి ఆహ్వానిస్తున్నాయి.
అదే సమయంలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఏపీలో తాను వైసీపీ తరఫున ప్రచారం చేస్తానని, జగన్ మోహన్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని చెప్పడంతో మైనారిటీ ఓట్ల మీద కూడా వైసీపీ ఆశలు పెంచుకుంటుంది. మైనారిటీ నాయకులకు స్పీకర్, మంత్రి పదవులు ఇచ్చిన తెలుగుదేశం మాత్రం మైనారిటీలు తమ వైపే ఉన్నారని చాలా ధీమాగా ఉంది.
మరోవైపు కేసీఆర్ ఏపీ రాజకీయల్లో అడుగుపెడితే తమకు చాలా లాభిస్తుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. అప్పడు బీజేపీ – వైసీపీ – టీఆర్ ఎస్ – జనసేన తెరచాటు మిత్రత్వం బయటపడుతుందని, బీజేపీ పట్ల వ్యతిరేకత వల్ల మిగతా వాళ్లంతా నష్టపోతారని టీడీపీ అంచనా వేస్తుంది. ప్రత్యేక హోదాను కూడా వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తే…. మాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల జోష్‌లో కేసీఆర్ అన్నమాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, తాను ఏపీకి వస్తే అది టీడీపీకి లాభం అన్న విషయం కేసీఆర్‌కు కూడా తెలుసనీ, అందువల్ల కేసీఆర్ పరోక్షంగా మాత్రమే ఏపీలో రాజకీయాలు నెరపే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.